top of page
Search
Writer's pictureKrishnateja

Man - Nature

Updated: Nov 17, 2018


This poem is a chronicling of man's roller coaster relationship with the nature over the millennia....


starting from man's fear of nature

progressing to worshipping and wondering at it

changing to exploring and experimenting with it

leading to mastering and subduing it

resulting in exploiting and polluting it

ending in fearing nature's fury






గుహలలో వసించి

వనములలో తిరిగి

మృగములను వేటాడి

శీతోష్ణములకు చలించి

ప్రకృతికి భయపడిన మనిషి


నిప్పును రాజేసి

నేలను చదునుజేసి

గ్రాసమును పండించి

గ్రామమున వసించి

ప్రకృతిని పూజించిన మనిషి


చెరువులను త్రవ్వి

నదులను మళ్ళించి

నీటిని నిలువజేసి

అన్నపానములను సమకూర్చి

ప్రకృతిని ప్రేమించిన మనిషి


గనులను త్రవ్వి

కొండలను తొలచి

నదులను చీల్చి

సముద్రపు లోతుచూచి

ప్రకృతిని శోధించిన మనిషి


శీతోష్ణములను నిగ్రహించి

వాయుగతిని ఏమార్చి

సూర్యతేజమును ఒడిసిపట్టి

మేఘములను సృష్టించి

ప్రకృతిని జయించిన మనిషి


ఆకాశహర్మ్యములు నిర్మించి

మబ్బులుదాటి నింగికెగసి

చంద్రునిపై కాలుమోపి

సృష్టి మూలమును ఛేదించి

ప్రకృతిని ధిక్కరించిన మనిషి


కాలువలను పూడ్చి

చెరువులను ఆక్రమించి

కొండలను నేలమట్టం చేసి

భూమిని డొల్లజేసి

ప్రకృతిని అపహసించిన మనిషి


అమృతగంగను విషముచేసి

భూసారమును బూడిదచేసి

ప్రాణవాయువును నిర్వీర్యముచేసి

భూతపంచమునకు ఆకాశమంత హాని చేసి

ప్రకృతిని హింసించిన మనిషి


ఒళ్ళు విరిచిన ప్రకృతి

జూలు విదిల్చిన ప్రకృతి

కన్నెర్రజేసిన ప్రకృతి

విలయనర్తనమాడిన ప్రకృతి

ప్రకృతికి భయపడిన మనిషి


-కృష్ణతేజ




45 views0 comments

Recent Posts

See All

Comments


bottom of page